అమ్మాయే కావాలి -hymavati


అమ్మాయే కావాలి

ఆడపిల్ల పుట్టింది ఈమాటలు మగతలోవున్న శారద చెవుల్లో పడ్డాయి. ఆతృతగా బిడ్డని చూడాలని కళ్ళుతెరచి “నర్స్ పాప పుట్టిందా”? “అవునమ్మా యిదిగో చూడు పాపని అంటూ ట్రేలో పడుకోపెట్టిన బిడ్డని చూపింది. అమాయకంగా ముద్దుగా వున్న బిడ్డని చూడగానే శారద తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆప్యాయంగ బిడ్డని తడిమింది,వార్డులో బెడ్డు మీదకి తీసుకురాగానే”ఆనవాయితీ తప్పలేదమ్మా నా లాగే నీకూ ఆడపిల్లే పుట్టింది.”అమ్మ మాటలు కఠోరంగా చెవులో పడ్డాయి.ఆస్వరంలొ వున్న తృణీకారం మనసులోముల్లు గుచ్చినట్లయింది.
మధ్యతరగతి కుటుంబంలో నాలుగో ఆడపిల్లగ జన్మించిన శారద ఆడపుట్టుకలొ అనుభవించవలసిన చిన్నచూపు తృణీకార భావం అంతా బాల్యం నుంచే చవి చూసింది. పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఒక దృఢాభిప్రాయానికి వచ్చింది ఎలాగైనా సరే ఆడపిల్ల యేవిషయంలోను తీసిపోదన్న విషయం నిరూపించాలని, మనసుకి తగిలిన ప్రతి గాయపు చేదుని ఒక్కొక్క సవాల్ గాతీసుకుంది.పొడుపు మాటల్ని పోగు చేసి పట్టుదలగా మలచుకొంది.దాని ఫలస్వరూపమే పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం లభించింది.

ఆరోజున కూడా తల్లి మూతి విరిచింది, మగమహారాజుకి చదువబ్బితే కుటుంబాన్ని పోషిస్తాడు ఆడపిల్ల చదివి యెవర్ని వుధ్దరించాలి? అంటూ దీర్ఘాతీసింది.వెనుకంజ అన్న పదం శారద నిఘంటువు లోంచి తొలగించివేసింది. ఇంటరులో స్కాలర్ షిప్పు దొరికింది, చదువుకోసం ప్రత్యేకించి ఖర్చులేదు చదువు మాన్పించితే పెళ్ళి చెయ్యాలి శారద ముగ్గురి అక్కలలో యిద్దరి పెళ్ళిళ్ళయ్యాయి. మూడో అమ్మాయి పెళ్ళి ప్రయత్నాలుజోరుగా అవుతున్నాయి. ఈ పరిస్థితిలో శారద గురించి పట్టించుకునే వాళ్ళులేరు.ఇంటరు,బి ఎ పూర్తి చేసి బేంకు పరీక్షలు యిచ్చి సెలెక్టు అయింది.ఇంటిలో వాళ్ళు శారద గురించి ఆలోచించే లోపున ఆమె బేంకు వుద్యోగి అయింది.
శారద తమ్ముడు మోహన్ తల్లి తండ్రులకు ముద్దు బిడ్డడు. కోరాలేగాని కొండమీది కోతినైనా తెచ్చికొడుకు ముందుంచేవారు, అంతంత మాత్రం చదువు సాగింది. గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి బండి ముందుకి సాగదని చదువు మానేసాడు గారాల కుమారుడు. అన్నీ సమయానికి అమర్చుతూంటే అది లేదు యిది లేదు అంటూ తల్లిమీద అక్క మీద కేకలువెయ్యడం తప్ప ప్రత్యేకమైన పనిలేదు.

ఒక రోజు పనిమీద వెళ్తున్నతండ్రి సైకిలు జీపుతో గుద్దుకుని కాలు విరిగి హాస్పిటల్ పాలయ్యాడు.ఆరోజున అన్నింటికీ అండగా నిల్చింది శారద.కాలు నయమై యింటికి వచ్చినా ఆరు నెలలు విశ్రాంతి అవసరం అని డాక్టరు చెప్పడంతో యింట్లోనే కర్ర సహాయంతో తిరుగు తున్న తండ్రికి శారదలొ వొక ప్రత్యేకత కనుపించింది.
తల్లి మాత్రం ఆడపిల్లకెందుకు వుద్యోగాలు పెళ్ళి చేసి వొక అయ్య చేతిలో పెట్టడమేగా అంటూ రోజూ దీర్ఘాలు తీసేదిగాని యీమధ్యకాలం అంతా ఆ అడపిల్లే సంసారాన్ని సజావుగా నడిచేటట్ట్లు చేసిందని వొప్పుకుందికి మనసొప్పలేదు. తమ్ముణ్ణి దారిన పెడదామని శత విధాల ప్రయత్నించి విఫలమైంది. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దామనుకుంది చిన్న చిన్న వ్యాపారాలు చెయ్యడానికి మోహన్ యిష్టపడలేదు.చేసేదిలేక తన వుద్యోగం మీద శ్రధ్ద పెట్టి వొకతపస్సులా ఏడు సంత్సరాలు గడిపింది బేంకు పరీక్షలన్నీ పాసై ఆఫీసరుగా ప్రమోషను పొందగలిగింది. ఆరోజున తల్లి తండ్రులు ఆమె వున్నతిని పరిపూర్ణ హృదయంతో ఆమోదించలేక కించపరిచే ధైర్యం లేక నిర్లిప్తత ప్రదర్శించారు. శారద కొత్తగా బాధ పడనూలేదు ప్రోత్సాహం ఆశించనూలెదు.

తన జీవితంలో కూడా వసంతం వస్తుందని వూహించని శారద తన తోటి వుద్యోగి తనను పెండ్లి చేసుకునే వుద్దేశంవ్యక్త పరుస్తే ముందు ఆశ్చర్యపోయింది వచ్చిన అవకాశం జారవిడువడం అవివేకమనుకుంది.తను వున్న పరిస్తితిలో పెండ్లి చేసుకుని వొక్కసారిగా బయట పడితే తల్లి తండ్రులు నిస్సహయులవుతారని తనను కోరుకున్న శేఖరుకి రెండు షరతులు పెట్టింది ఒకటి తన తల్లి తండ్రుల పోషణకు అభ్యంతరం వుండకూడదు. రెండవది తనకి ఆడపిల్ల పుడితే హీనదృష్టితో చూడకూడదు. రెండు షరతులు బేషరతుగా వొప్పుకున్నాడు .తనకి అమ్మాయే కావాలంటూ మనస్ఫూర్తిగా శారద చేయినందుకున్నాడు.
అంతా నిర్ణయించుకున్నాక తల్లితండ్రులకు తెలియజెప్పింది. తమకున్న ఒక్క బాధ్యత తీరుతున్నందుకు సంతోషించారు. తరువాత తమగతేమిటని వ్యాకుల పడ్డారు. తన తరఫున యెవరూ లేకపోవటంతో శేఖరు వాళ్లతోనే వుంటూ శారద తల్లితండ్రులను తన వారిగానె భావించి గౌరవించడంతో వారి మనసు తేలిక పడింది. శారదకి పెండ్లి అయినట్లు పరాయి అయినట్లుగాఅనిపించలేదు.
అప్పుడప్పుడు తన గురించి యితరులతో మా శారద యిలాగ అలాగ అంటూ చెప్పినప్పుడు రవ్వంతాప్యాయత తల్లి స్వరంలొ విన్నప్పుడు మాత్రం శారద కొద్దిగా చలించేది. పెండ్లయిన యేడాదికి శారద గర్భవతి అయింది. బిడ్డ పుట్టేవరకు కాలం చాలా ఆహ్లాదకరంగానే గడిచింది శారదని కాలు కింద పెట్టనివ్వకుండా కావలసినవి చేసి పెట్టి తల్లి చాలా అపురూపంగా చూసేది
మర్నాడు ప్రసవిస్తుందనగా ముందు రోజు శేఖరుతో అంది శారద “అందరూ నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకుగాని పాప పుడితే పాపని యింత అపురూపంగానూ చూసుకుంటారా?”” నీ కెందుకాసందేహం నాకు ఆడపిల్లే కావాలి సరేనా నిశ్చింతగా నిద్రపో.”అంటూ ముంగురులు సవరించాడు శేఖర్.

ఈ సంభాషణ జరిగిన యిరవై నాల్గు గంటల్లో శారదకి ఆడపిల్ల పుట్టింది.తల్లి తన అలవాటులో వున్న డైలాగులు అంటూవుంటే శారద మనసు మెలి పెట్టినట్ట్లయింది. ఎప్పటికి వీళ్ళలో మార్పు కలిగేది నిస్పృహగా నిట్టూర్చింది. నర్సు పాపని తెచ్చిపక్కలో పరుండ పెట్టింది అపురూపంగా రెండు చేతులతో చుట్టిహ్రృదయానికి హత్తుకుంది శారద యీజన్మకీ వరం చాలు అన్నట్ట్లుగా. ఇంతలో జిగ్గుమన్న వెలుగుతో వులిక్కి పడింది.ఎదురుగా శేఖర్ పసిబిడ్డకీ తనకీ కలిపి ఫొటో తీసాడు.ఏమిటీ పని అంటే నాకు ముందే తెలుసు పాపంటె నీకు చాల యిష్టం మోదటిసారిగా మాతృప్రేమని చవి చూస్తున్న మన పాపని, నీకళ్ళలో తొణికిసలాడుతున్న మమకారాన్ని ఫొటోలో బంధించి యీ అపురూపమైన దృశ్యాన్ని మళ్ళీమళ్ళీ చూసుకోవాలని యీ పని చేసాను.ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లల్ల్ని కంటామంటే ప్రభుత్త్వం వొప్పుకోదు కదా!

వాతావరణంలో యెంతటి వుల్లాసం .పై మాటలు విన్నాక ప్రపంచాన్ని జయించినట్లనిపించింది శారదకి.నాలుగోనాడు యింటికి తీసుకు వెళ్ళారు తల్లినీ బిడ్డనీ. బాలసారె జరిపించి బేంకువుద్యోగుల్ని పిలుద్దామంటే తల్లి గొణిగింది మగ పిల్లాడైతే యివన్నీ చెయ్యొచ్చుగాని ఆడపిల్లకీ ఆడంబరాలెందుకే అంది.”అమ్మా!యీ క్షణంనుంచి ఆమాట మర్చిపో యీ బిడ్డ నా జీవన జ్యోతి. ఏ ఆడపిల్ల గురించి న్యూనత చూపించకు”. గట్టిగానే మందలించటంతో తల్లి మౌనం వహించింది “బంగారూ నీకేం పేరు పెట్టాలమ్మ” అంది మురిపెంగా ప్రక్కనే కూర్చున్న శేఖర్ యిప్పుడే అన్నావుగా నా జీవన జ్యోతి అని జ్యోతి పేరే పెట్టు.
బిడ్డని ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ టి వి వైపు చూస్తే అందులో కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అంటూ వచ్చింది. అది చూసి మనసారా నవ్వుకున్నారు.
-hymavati

Submitted on: Sun Jun 23 2013 05:04:42 GMT-0700 (PDT)
Category: Original
Language: Telugu
Copyright: A Billion Stories (http://www.abillionstories.com) Submit your own work at http://www.abillionstories.com
Read submissions at http://abilionstories.wordpress.com
Submit a poem, quote, proverb, story, mantra, folklore in your own language at http://www.abillionstories.com/submit

Leave a comment